ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్కి సినిమాలో కర్ణుడి పాత్రకు లేని గొప్పదనాన్ని ఆపాదించారన్న అనంత శ్రీరామ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 05, 2025, 08:54 PM

విజయవాడ కేసరపల్లిలో వీహెచ్ పీ ఆధ్వర్యంలో లక్షలాది మందితో నిర్వహించిన హైందవ శంఖారావం ధార్మిక సభకు టాలీవుడ్ గీత రచయిత అనంత శ్రీరామ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల వచ్చిన కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను వక్రీకరించడం చూసి సిగ్గుపడుతున్నానని అన్నారు."భారతీయ వాజ్మయానికి మహాభారతం, రామాయణం రెండు కళ్లు లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన సినిమాల నుంచి, నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా... కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే నిలబడి చెబుతున్నాను. పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే మనం హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు... హిందువునని ప్రకటించుకోవడం కూడా వ్యర్థం. ద్రౌపది వలువలు తొలగించండి అని నిండు సభలో సలహా ఇచ్చిన కర్ణుడ్ని శూరుడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుడ్ని (దుర్యోధనుడ్ని) కూడా వదిలేసి ప్రాణభయంతో పరిగెత్తిన కర్ణుడ్ని వీరుడు, శూరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? ఏదో దానంగా వచ్చిన రాజ్యంలో, దాన ధర్మాలు చేసినంత మాత్రాన కర్ణుడ్ని ధర్మరాజు అంతటి గొప్ప దాత అంటే మన హైందవ సమాజం ఒప్పుకుంటుందా? కల్కి సినిమాలో... అగ్నిదేవుడు ఇచ్చిన ధనుస్సు చేతబట్టిన అర్జునుడు కంటే, సూర్యుడు ఇచ్చిన ధనుస్సు చేతపట్టిన కర్ణుడు వీరుడంటే... యుద్ధంలో నెగ్గేది ధనుస్సా, ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు... వాల్మీకి రామాయణంలో రాయి ఆడది అయినట్టు, రాళ్లను తేల్చి వారధి అయినట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు... ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూతకల్పనలు, ఎన్నో వక్రీకరణలు చేశారు. మనం ఇలాగే ఊరుకుందామా?" అంటూ అనంత శ్రీరామ్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.అంతేగాకుండా, టాలీవుడ్ ఇండస్ట్రీలో తెర వెనుక అన్యమతస్తుల చేతిలో ఎదురైన అనుభవాల్లో ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను అంటూ అనంత శ్రీరామ్ తన ప్రసంగం చివర్లో పేర్కొన్నారు. "ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి వద్దకు వెళ్లాను. ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి అతడు ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని పాట చేయనన్నావు కాబట్టి... జీవితాంతం, నువ్వు చేసిన ఏ పాటకీ నేను రాయను అని ప్రతిజ్ఞ చేశాను. 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అలాగే హైందవ ధర్మాన్ని కించపరిచే సినిమాలు తీసే నిర్మాతలకు డబ్బులు రాకుండా చేయాలంటే ప్రభుత్వాల కంటే ముందు ప్రజలే ఆ సినిమాను తిరస్కరించాలి" అని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com