పిల్లలపై లైంగిక దాడులను అరికట్టి, రక్షణ కల్పించాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నామని ఎస్పీ జి.బిందుమాధవ్ తెలిపారు. కర్నూలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆడియో, వీడియో సీడీని ఆయన ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ చాలా చోట్ల చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. పసిపిల్లలు బ్యాడ్ టచ్ జరిగినప్పుడు సమాజానికి భయపడి తల్లిదండ్రులకు చెబితే వారు తిడుతారేమో అని చదువు మానిపిస్తారే మోనని భయపడకుండా డయల్ 100కు గానీ, డయల్ 112కు గానీ ఫిర్యాదు చేయాలన్నారు. బాధితులు ఎవరైనా పిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచు తామన్నారు. 5 నిమిషాల వీడియో ద్వారా చిన్న పిల్లలకు అవగాహన కల్పించేందుకు కర్నూలు పోలీసులు చర్యలు చేపట్టారన్నారు. పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు కృషి చేసిన కోడుమూరు సీఐ తబ్రేజ్, సంగీత దర్శకుడు ఫయూమ్, గాయకుడు కరీముల్లా, డ్యాన్సర్లు, నటీన టులు, పోలీసులు, విద్యార్థులను ఎస్పీ అభినం దించారు. ఈ కార్యక్రమంలో అడిషన్ ఎస్పీ అడ్మిన్ జి.హుశేన్‌పీరా, డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు, ఎస్‌ఐలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.