ఆత్మకూరు కేంద్రంగా మూడురోజుల పాటు జరిగిన ఉమూమి తబ్లిగీ ఇజితెమా గురువారం మధ్యాహ్నం ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజు జరిగిన సామూహిక దువా కార్యక్రమానికి లక్షలాదిగా హాజరయ్యారు. ఇజితెమాలో జరిగే ఈ దువా కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం రాత్రికే లక్షలాదిగా ఇజితెమా ప్రాంగణానికి చేరుకున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే సామూహిక ప్రార్థనలు చేపట్టారు. ఆ తర్వాత ముంబై, నిజామోద్దిన్, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హాజరైన ఉలేమాలు ఉలేమాలు మహ్మద్ ప్రవక్త నిర్దేశించిన మార్గదర్శకాలతో పాటు ప్రపంచశాంతి, దేశ ఔన్నత్యం గురించి వివరించారు. సర్వమానవాళి సమానమేనని అందరి పట్ల ప్రేమ, కరుణ, జాలి, దయ, ఆప్యాయతను కలిగి ఉండాలని ఉపదేశించారు. మతాలకు అతీతంగా దేశ ఐక్యతను కాపాడుకుందామని ఉద్బోధించారు. ఆ తర్వాత 12.30 గంటల సమయంలో సామూహిక దువాను నిర్వహించిన అనంతరం మధ్యాహ్న నమాజ్‌ను పూర్తి చేసుకుని ఇజితెమా వేడుకలకు ముగింపు పలికారు. ఇదిలా వుంటే చివరి రోజు కూడా ఇజితెమాకు వచ్చిన వారికి నిర్వహణ కమిటీ వారు భారీ ఏర్పాట్లను కల్పించారు. వచ్చిన వారికి అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపుగదులు, విద్యుత్ సదుపాయం సమకూర్చారు. అదేక్రమంలో 17 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసిన సౌకర్యవంతమైన భోజన వసతిని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి దాతలు ఇజితెమాకు వచ్చిన వారికి మజ్జిగ, పండ్లు, వాటిర్ బాటిళ్ల పంపిణీ చేపట్టారు. ప్రభుత్వ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సిద్ధం చేశారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించారు. ఇజితెమా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ దుకాణాల్లో కొనుగోళ్లు ఉత్సాహంగా సాగాయి. చివరి రోజు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇజితెమా కార్యక్రమాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లపై కమిటీని అభినందించారు.