తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఘటన నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. చంద్రబాబుతో పాటు జిల్లా ఎస్పీ, టీటీడీ పాలకమండలి సభ్యులు అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని కోర్టులకు విన్నవించారు.ఘటన జరిగి రోజులు గడుస్తున్నా బాధ్యులపై ఇంత వరకు కేసులు ఎందుకు నమోదు చేయలేదని రోజా ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన వారిని ఇంకా కాపాడాలని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం చూస్తున్నారని మండిపడ్డారు. భక్తుల ప్రాణాలకు వీరు విలువ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తారని మీకు తెలియదా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతోందని... టోకెన్ సిస్టంను మీరు ఎందుకు తీసేయలేదని రోజా ప్రశ్నించారు. టోకెన్ సిస్టం గురించి మాట్లాడుతూ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయని అన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎస్పీ, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో అని మీరే చెపుతున్నారని... వాళ్ల తాట ఎందుకు తీయడం లేదని రోజా ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు మానవత్వం లేదని పవన్ కల్యాణ్ అన్నారని... 'గేమ్ ఛేంజర్' ఫంక్షన్ నుంచి తిరిగి వెళుతూ ఇద్దరు చనిపోతే వారి కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ కనీసం పరామర్శించలేదని అన్నారు. తొక్కిసలాట ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు నోరు విప్పలేదని విమర్శించారు. మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలు దిగజారుడుగా ఉన్నాయని అన్నారు.