పండుగ సమయంలో సొంత ఊరికి వెళ్లి అందరితో సంతోషంగా గడపాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే తాను ప్రతి సంక్రాంతికి తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళతానని చెప్పారు. ఊరికి వెళ్లి నలుగురితో కలవడాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. తన భార్య భువనేశ్వరి వల్లే తనకు ఇది అలవాటయిందని చెప్పారు. పాతికేళ్ల క్రితం ఆమె పట్టుబట్టి ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టిందని తెలిపారు. ఆ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు. తెలుగు ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాంక్షించారు.మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ సమయంలో... అందరూ ఒక చోట కలవడం, మాట్లాడుకోవడం, సుఖదుఃఖాలను పంచుకోవడం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. మనం ఊరిలో పండుగ చేసుకునేటప్పుడు... ఊరిలోని పేదవాడు కూడా సంతోషంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. పేదలకు చేయూతనిచ్చి వారిని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకే పీ4 కాన్సెప్ట్ పేపర్ ను రేపు విడుదల చేస్తున్నామని తెలిపారు. అన్ని స్థాయుల్లో దీనిపై చర్చ జరిగిన తర్వాత అమల్లోకి తెస్తామని చెప్పారు.