టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఇటీవల ఓ యువతితో కలిసి పార్టీలో పాల్గొన్న ఫొటో ఒకటి నెట్టింట బాగా హల్‌చల్ చేసింది. భార్య ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. దాంతో చాహల్ ఆమెతో డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి.ఆ ఫొటోలో ఉన్న యువతి పేరు ఆర్‌జే మహ్వాశ్. ఆమె ఒక రేడియో జాకీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. తాజాగా తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూమర్స్‌పై ఆమె స్పందించింది. ఒక్క ఫొటో ఆధారంగా చాహల్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు కథలు అల్లేయడం ఎంతవరకు సమంజసం అని మహ్వాశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది.మహ్వాశ్ తన పోస్ట్‌లో ఇటువంటి నిరాధార పుకార్లపై మండిపడింది. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి కనిపిస్తే డేటింగ్ ఊహాగానాలకు ఎందుకు దారితీస్తుందని ఆమె ప్రశ్నించింది. రెండు మూడు రోజులుగా తాను ఓపికగా ఉన్నానని, అనవసరంగా తనను బ్లేమ్ చేస్తే ఊరుకునేది లేదని తెలిపింది. కష్ట సమయాల్లో ఇతరులను వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో శాంతియుతంగా గడపనివ్వాలని మహ్వాశ్ కోరింది. ఇదిలా ఉంటే.. గతకొంత కాలంగా చాహల్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకోవడం, ఇటీవల భార్యతో ఉన్న ఫొటోలను చాహల్ తొలగించడం వంటివాటితో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లైంది. అయితే, ఇంత చర్చ జరిగినప్పటికీ, చాహల్ లేదా ధనశ్రీ వర్మ నుంచి వారి రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.