ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కాస్త ఫర్వాలేదనిపించిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి కావాలంటూ బీసీసీఐని కోరాడు. అందుకు బోర్డ్ కూడా అంగీకరించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అయితే, తాజాగా బీసీసీఐ అధికారులు యూ-టర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నా ఫర్వాలేదు, కానీ ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో జరిగే వన్డే సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉండాలంటూ కేఎల్ రాహుల్‌కు సమాచారం ఇచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు ముఖ్యమైన సిరీస్ కావడంతో బీసీసీఐ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అజిత్ అగార్కర్ సారధ్యంలోని సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండాలని కోరినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. ‘‘వన్డేలలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన కేఎల్ రాహుల్‌కు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు విశ్రాంతి ఇవ్వాలని తొలుత భావించారు. కానీ, ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కొంత ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో బీసీసీఐ మనసు మార్చుకుంది. వన్డే సిరీస్‌లో ఆడాలని కోరింది’’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారని తెలిపింది. కాగా, ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ బ్యాటర్లు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అయితే, అడపాదడపా రాణించిన ఒకరిద్దరు బ్యాటర్లలో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. సిరీస్‌లోని 10 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్ 30.66 సగటుతో మొత్తం 276 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన మూడవ ఆటగాడిగా నిలిచాడు.