ఆంధ్రప్రదేశ్‌లో చిరుత పులి సంచారం భయపెడుతోంది. నిత్యం ఏదో ఒక చోట చిరుత పులి, పెద్దపులి సంచారం అంటూ వార్తలు వస్తున్నాయి. శనివారం సాయంత్రం తిరుపతిలోని జూపార్క్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపిన సంగతి తెలసిందే. చిరుత పులి రోడ్డు దాటుతూ టీటీడీ ఉద్యోగికి కనిపించింది. చిరుతను చూసిన టీటీడీ ఉద్యోగి భయంతో అక్కడి నుంచి వేగంగా వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతని బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టీటీడీ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న స్థానికులు ఆయనను గమనించి ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన మరువకముందే మరోచోట పెద్దపులి సంచారం అంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో పెద్దపులి సంచరిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దారకొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతోందని స్థానికులు చెప్తున్నారు. ఆదివారం ఉదయం కూడా పెద్దపులి కనిపించిందంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దారకొండ ఘాట్ రోడ్డుపై పులి తిరుగుతున్న సమయంలో డొంకరాయి నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వెళ్తున్న కొంతమంది వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దారకొండ ఘాట్ రోడ్డులోని సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద పులి కనిపించినట్లు స్థానిక గిరిజనులు చెప్తున్నారు.
మరోవైపు అల్లూరి జిల్లాలో కొద్దిరోజులుగా పెద్దపులి తిరుగుతోందన్న వార్తలతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పెద్దపులి సంచారం వార్తలకు బలం చేకూరుస్తూ ఇటీవలే ఓ యువకుడికి పెద్దపులి కనిపించింది. దీంతో భయపడిపోయిన యువకుడు గ్రామంలోకి పరుగులు తీశాడు. అడ్డతీగల మండలం కినపర్తి చెందిన ఓ యువకుడికి శనివారం పెద్దపులి కనిపించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ యువకుడు పొలానికి వెళ్తుండగా.. ఎదురుగా పెద్దపులి ప్రత్యక్షమైంది, దీంతో ఆ యువకుడు, అతని భార్య అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఉరుకులు పరుగుల మీద గ్రామానికి చేరుకుని గ్రామస్థులకు విషయం వివరించారు. పెద్దపులి నుంచి తప్పించుకునే క్రమంలో వారికి గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు.