దేశరాజధాని ఢిల్లీలో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 7వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 5వ తేదీనే పోలింగ్ కూడా నిర్వహించబోతున్నారు. ఈక్రమంలోనే ప్రధాన పార్టీలు అన్నీ పెద్ద ఎత్తున హామీలు ఇస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. మరోవైపు ఇతర పార్టీలను తక్కువ చేసేందుకు ఒకరిపై ఒకరు విపరీతమైన నేరారోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీలో జరగబోయేది అదే అంటూ జోస్యం చెప్పారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, ఆప్ మధ్య పోటీ నడుస్తోంది. ఒక పార్టీపై మరో పార్టీ వారు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటును బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలోని మురికి వాడలన్నింటినీ కూల్చివేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. షాకుర్ బస్తీ ప్రాంతంలో జరిగిన విలేకరుల సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ కామెంట్లు చేశారు.
మురికి వాడల వాసల సంక్షేమం కంటే బీజేపీకి భూ సేకరణపైనే ప్రేమ ఎక్కువని విమర్శించారు. గత ఐదేళ్లలో మరికి వాడల ప్రజల వద్దకు బీజేపీ వెళ్లలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వారి చుట్టూనే తిరుగుతూ.. ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. బీజేపీ పూర్తి ధనవంతుల పార్టీ అని.. అలాంటి నేతలు మరికి వాడల్లోని ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటారంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ఇటీవలే కేంద్రమంత్రి అమిత్ షా మురికి వాడల్లోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారని.. ఆ సమయంలో తనను ఉద్దేశిస్తూ ఆయన ఉపయోగించిన పదజాలం చాలా అసభ్యకరంగా ఉందని తెలిపారు. ఆయనతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని.. కేవలం ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఆప్ సీనియర్ నాయకుడు, 2013, 2015, 2020లో షాకుర్ బస్తీ నుంచి పోటీ చేసి గెలిచిన సత్యేంజర్ జైన్ పాల్గొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్నాయి. మూడ్రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 8వ తేదీ రోజున ఫలితాలు వెల్లడించబోతున్నారు. 2020 ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. చూడాలి మరి ఎం జరగనుంది అనేది.