రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలకు గానూ అరకొర నిధులను విడుదల చేస్తూ, సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బాకాయిలు రూ.25000 కోట్లు ఉంటే, కూటమి ప్రభుత్వం కేవలం రూ.1300 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. ఇవ్వాల్సిన బకాయిలు కొండంత... చెల్లింపులు చేస్తామన్నది గోరంతగా ఉందని విమర్శించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.రాష్ట్రప్రభుత్వం పెండింగ్ బకాయిల కోసం మొత్తం రూ.6700 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో రూ.1300 కోట్లు మాత్రమే ఉద్యోగులకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కొద్దిపాటి మొత్తాన్ని విడుదల చేస్తూ ఏదో ఉద్యోగులకు వరాలు కురిపించినట్లు, సంక్రాంతి కానుకను అందించినట్లు ప్రచారం చేసుకోవడం ఆక్షేపనీయం. మీరు ఇవ్వాల్సిన బకాయిలు ఎంత? మీరు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం బయట పడుతుంది. గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలను గురించి నిర్ణయాలు తీసుకునేంది. కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగసంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను పిలిచి మాట్లాడిన దాఖలాలే లేవు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించి రూ.1300 కోట్లలోనూ రూ. 519 కోట్లు జీపీఎఫ్ కోసం, రూ.214 కోట్లు కేవలం పోలీస్ విభాగం ఒక విడత సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం రూ. 300 కోట్లు మాత్రమే కడతామని చెబుతున్నారు. ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక? అని ప్రశ్నించారు.