ఈ ఏడాది ప్రజలకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ సంతోషాలను దూరం చేసిందని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఒకవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు... మరోవైపు ప్రభుత్వ పథకాల అమలుకు మంగళం... దీనితో గ్రామాల్లో ప్రజలు తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పండుగకు గతంలో చంద్రబాబు బ్రాండ్ అంటూ గొప్పగా చెప్పుకునే సంక్రాంతి కానుక అయినా అందిస్తారని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తే, వారికి మొండిచేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది సరిగ్గా ఇదే సంక్రాంతి పండుగ సమయానికి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం పథకాలకు సంబంధించిన డబ్బును అర్హులైన పేదల ఖాతాలకు జమ చేసిందని, సంతోషంతో పల్లెల్లో పండుగను ఆ కుటుంబాలు జరుపుకున్నాయని గుర్తు చేశారు.