తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ శోభ వచ్చేసింది. సంక్రాంతి పండగంటే పిండివంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలతో పాటుగా ఠక్కున గుర్తొచ్చేవి కోడిపందేలు. అంతలా కోడిపందేలు సంక్రాంతి పండుగలో భాగమైపోయాయి. సంక్రాంతి పండగంటే కోడిపందేల పోటీలు అనేంతలా పరిస్థితి మారిపోయింది. కోడిపందేల బరులు, అక్కడి వాతావరణం అబ్బో మామూలుగా ఉండదంతే. ఎప్పట్లాగే ఇక ఈ పండగకు కూడా బరిలో తలపడేందుకు కోడిపుంజులు రెడీ అయ్యాయి. వాటి యజమానులు కూడా బరిలో తమ కోడి విజయం సాధించేలా కసరత్తులు మొదలెట్టారు. తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఇప్పటికే ఈ తరహా వాతావరణం కనిపిస్తోంది.
అయితే కృష్ణా జిల్లాలో మాత్రం అనుకోని ఘటన జరిగింది. కృష్ణా జిల్లా తేలప్రోలు చిన్న బజారుకు చెందిన మణికంఠ రెడ్డి గత కొంతకాలంగా కోళ్లు పెంచుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తోందని వీటిని మరింత జాగ్రత్తగా పెంచుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే మణికంఠరెడ్డి పెంచుతున్న కోడిపుంజులను శనివారం రాత్రి కొంతమంది దొంగలు దొంగిలించారు. రూ.5 లక్షల వరకూ విలువ చేసే 15 కోళ్లను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. కోడిపుంజుల పర్యవేక్షణ కోసం మణికంఠ రెడ్డి సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయించారు. అయితే సీసీటీవీ కెమెరాల కళ్లుగప్పి మరీ ఈ చోరీ జరగడం గమనార్హం.
శనివారం రాత్రి చోరీకి వచ్చిన దుండగులు సీసీ కెమెరాలపై దుస్తుల కప్పి మరీ కోళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో చోరీ చేసిన దుండగులను గుర్తించలేని పరిస్థితి వచ్చింది. ఇక కోళ్ల దొంగతనంపై మణికంఠ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని.. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలకు దుస్తులు కప్పి మరీ చోరీ చేశారంటే ఇది తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలిసిన వారికి అయితేనే సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే సంగతి తెలుస్తుందని.. అప్పుడే వాటికి కంటికి చిక్కకుండా ఇలా తప్పించుకోగలుగుతారని భావిస్తున్నారు. అలాగే ఈ కోళ్ల దొంగల పనిపట్టేందుకు వారి కోసం గాలిస్తున్నారు.