మరికొన్ని రోజుల్లోనే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ప్రధాన పార్టీలు అన్నీ ఒటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున పథకాలను తీసుకు వస్తున్నారు. ఓవైపు ఆప్, మరోవైపు బీజేపీలు అనేక ఉచిత పథకాలు తీసుకు రాగా.. కాంగ్రెస్ కూడా సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. ఇటీవలే జీవన్ రక్షా యోజన పేరుతో ఓ పథకం తీసుకొచ్చిన చేయి గుర్తు.. తాజాగా యువ ఉడాన్ యోజన పేరుతో మరో పథకాన్ని తీసుకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే నిరుద్యోగులకు నెలనెలా 8 వేల 500 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2015లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు దక్కించుకోగా బీజేపీ 3 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన 2020 శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను చేజిక్కించుకోగా.. బీజేపీ 8 సీట్లను కైవసం చేసుకుంది. ఇలా రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయిన కాంగ్రెస్.. ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందేందుకు పెద్ద ఎత్తునే ప్రయత్నాలు చేస్తోంది.
ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలకు వ్యతిరేకంగా సరికొత్త పథకాలు ప్రకటిస్తూ.. ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. డిసెంబర్ 7వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ఆ మరుసటి రోజే ఓ పథకాన్ని తీసుకొచ్చింది. మేనిఫెస్టోను ఇప్పటికీ విడుదల చేయకపోయినా సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలపై దృష్టి సారించి సరికొత్త పథకాలతో అడుగులు వేస్తోంది.
ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలై మరుసటి రోజు జీవన్ రక్షా యోజన్ పేరుతో.. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతకు ముందే దీదీ యోజన పథకం కింద ఢిల్లీలోని ప్రతి మహిళకు నెల నెలా రూ.2, 500 అందిస్తామని వివరించింది.
అయితే తాజాగా మరో సరికొత్త పథకంతో ఓటర్ల ముందుకు వచ్చింది హస్తం పార్టీ. ఢిల్లీలో చదువుకుని ఏడాది పాటు ఖాళీగా ఉన్న యువతీ యువకులకు నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించింది. ముఖ్యంగా "యువ ఉడాన్ యోజన" పథకం పేరుతో నెల నెలా నిరుద్యోగులకు 8 వేల 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని నేరుగా కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ తెలిపారు.