వెనుకబడిన కులాల అభ్యున్నతి, ఆర్థిక పురోభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వివిధ సామాజికవర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వాటి ద్వారా వారికి ఆర్థికంగా చేయూత అందించి స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి, అగ్రవర్ణాల పేదలకు (ఈడబ్ల్యూఎస్ వర్గాలు) బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పించనున్నారు. బీసీ వర్గాల సేవా సహకార సంస్థ ద్వారా రూ.25.6 కోట్ల విలువైన పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీతో రాయితీ రుణాలు అందిస్తున్నారు. ఈ సబ్సిడీ రుణాల ద్వారా వారు స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు ఆయా జిల్లాలలోని వెనుకబడిన తరగతుల సేవా సహకార సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇక ఈ విధానంలో మూడు శ్లాబుల విధానం ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒకటో శ్లాబ్ కింద యూనిట్ విలువ రెండు లక్షల లోపు ఉంటుంది. ఇందులో 75 వేల వరకూ సబ్సిడీ ఇస్తారు. రెండో శ్లాబులో యూనిట్ విలువ రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో రూ.1.25 లక్షలు రాయితీ ఇస్తారు. ఇక మూడో శ్లాబులో యూనిట్ విలువ మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ఉంటుంది. ఇందులో రూ.2 లక్షల వరకూ ప్రభుత్వం రాయితీ ఇస్తుంది.
ఇక డీ- ఫార్మసీ, బీ- ఫార్మసీ వంటి కోర్సులు చేసిన నిరుద్యోగ బీసీ యువతకు జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి రుణాలు అందిస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.8 లక్షల వరకూ ఖర్చుకానుండగా.. అందులో 50 శాతం అంటే రూ. 4 లక్షలు రాయితీ ఇస్తారు. మిగతా రూ.4 లక్షలు బ్యాంకు రుణంగా ఇవ్వనున్నారు. అలాగే అగ్రవర్ణ పేదలకు (ఈబీసీలు) అంటే కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య సంఘాలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తున్నారు. ఇందులోనూ 50 శాతం ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. అయితే ఈ పథకాలకు అర్హత వయస్సును 21 నుంచి 60 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్ లైన్లో నమోదు చేసుకున్న తర్వాత స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సంప్రందించాల్సి ఉంటుంది.