మంచు కుటుంబం.. సినీ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాల్లో ఇది కూడా ఒకటి. అయితే నిత్యం ఏదో ఒక రకంగా మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు, కేసులు అందరికీ తెలిసిన విషయమే. అలాగే మీడియా ప్రతినిధులపై మంచు మోహన్ బాబు దాడి కూడా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ ఘటనల నుంచి మంచు ఫ్యామిలీ కాస్త బయటపడుతోంది. అందరి కుటుంబాల్లోలాగే తమ ఫ్యామిలీలోనూ చిన్నపాటి గొడవలు ఉన్నాయని.. కుటుంబం అన్నాక ఇలాంటి గొడవలు సహజమేనని మంచు కుటుంబం చెప్తోంది.
అయితే ఈ విషయాలను పక్కనబెడితే.. పండగ పూట అందరూ మెచ్చుకునే పని చేశారు సినీ హీరో మంచు విష్ణు. దీంతో మంచు విష్ణుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తిరుపతిలోని బైరాగిపట్టెడలో ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథల పిల్లలను మంచు విష్ణు దత్తత తీసుకున్నారు. ఈ చిన్నారులు అందరికీ అన్నగా అండగా ఉంటానని మంచు విష్ణు తెలిపారు, మాతృశ్య సంస్థ నిర్వాహకురాలు శ్రీదేవి 120 మంది చిన్నారులను ఆదరిస్తున్నారన్న మంచు విష్ణు.. ఇకపై వీరికి కావాల్సిన విద్యా, వైద్యంతోపాటు కుటుంబసభ్యుడిలా తోడుంటానని చెప్పారు.
కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదన్న మంచు విష్ణు.. అయితే ఈ విధంగానైనా కొందరు ఆదర్శంగా తీసుకుని అనాథలకు సాయం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇకపై ఈ చిన్నారులకు అన్నగా తోడుంటానని, వారంతా తన కుటుంబసభ్యులే అన్నారు. వారితో పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందని మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని అనాథలకు సాయం చేయాలని కోరారు. మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మి సైతం అనేక పాఠశాలలను దత్తత తీసుకుని వాటిలో మౌలిక వసతులు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో మంచు కుటుంబం భోగి పండుగను జరుపుకుంది, భోగిమంటలు వేసి సందడిగా గడిపారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు, ఆయన భార్య, మంచు విష్ణు, ఆయన సతీమణి, పిల్లలు పాల్గొన్నారు.