భవిష్యత్తులో టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బాధ్యతలు తీసుకుంటాడా? అంటే సోషల్ మీడియా వేదికగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణంగా విఫలవడంతో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లకు వీడ్కోలు పలికి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని అభిమానులు, మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ అయితే ఆసీస్ పర్యటనలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను అతను ఖండించాడు. అయితే ఆదివారం ఆసీస్ పర్యటనపై బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశానికి రోహిత్ శర్మ హాజరయ్యాడు.
మరికొంత కాలం కెప్టెన్‌గా రోహిత్ శర్మనే..
మరికొంత కాలం టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని, ఆలోపు కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు చేయాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. టీమిండియాకు మరో 6 నెలల పాటు టెస్ట్ సిరీస్‌లు లేవు. ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా.. అనంతరం ఐపీఎల్ ప్రారంభం కానుంది. జూన్‌లో టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగుతాడనిపిస్తోంది. రోహిత్ వారసుడిగా బుమ్రాకు సారథ్య బాధ్యతలు కట్టబెట్టడంపై ఏకాభిప్రాయం కుదరట్లేదని తెలుస్తోంది. బుమ్రా తరుచూ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో అతని కెరీర్ ఎంత కాలం పొడిగించుకోగలడన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రేసులో యశస్వి జైస్వాల్..
ఈ క్రమంలోనే భవిష్యత్తు సారథి ఎవరా? అనేది కూడా ఈ సమావేశంలో బీసీసీఐ చర్చించినట్లు తెలుస్తోంది. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్ లోడ్ ఎక్కువవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే సెలెక్షన్ కమిటీ రిషభ్ పంత్ పేరును ఫ్యూచర్ కెప్టెన్‌గా ప్రతిపాదించిందని సమాచారం.
అయితే గంభీర్ అనూహ్యంగా యశస్వి జైస్వాల్ పేరు ప్రతిపాదించాడట. ఇప్పటి వరకు అయితే ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గంభీర్ సూచనలను సెలెక్షన్ కమిటీ పట్టించుకుంటుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి. యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా టెస్ట్‌ల్లో అదరగొడుతున్నాడు.