ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీమార్ట్‌కు షాక్.. లాభం, ఆదాయం పెరిగినా భారీగా పడిపోయిన స్టాక్

business |  Suryaa Desk  | Published : Mon, Jan 13, 2025, 11:37 PM

భారత స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. గత కొన్ని సెషన్ల నుంచి తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతున్న మార్కెట్లు మళ్లీ అవే అనిశ్చితిలో ముగిశాయి. సోమవారం సెషన్లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1049 పాయింట్ల పతనంతో 76,330 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 345.55 పాయింట్లు తగ్గి 23,085.95 వద్ద సెషన్ ముగించింది. మార్కెట్లు నష్టపోయిన తరుణంలోనే చాలా స్టాక్స్ ఇవాళ్టి సెషన్లో భారీగా పడిపోయాయి. ఇందులో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రముఖ సూపర్ మార్కెట్స్ అండ్ హైపర్‌మార్కెట్స్ చెయిన్ అయిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఫౌండర్ రాధాకిషన్ దమానీ.. డీమార్ట్ స్టాక్ గురించి తెలుసుకోవాలి.


సోమవారం సెషన్‌లో NSE లో చూసినట్లయితే ఈ స్టాక్ 5.05 శాతం పడిపోయింది. కిందటి సెషన్లో రూ. 3,686.25 వద్ద ముగియగా.. ఇవాళ నేరుగా 5 శాతం నష్టంతోనే 3,501 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 6 శాతం నష్టంతో రూ. 3,469.95 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇక చివరకు రూ. 3500 వద్ద సెషన్ ముగించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.28 లక్షల కోట్లకు తగ్గింది. ఇక స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 5,484.85 కాగా.. కనిష్ట ధర రూ. 3,399 గా ఉంది. గత 5 రోజుల్లో ఈ స్టాక్ 11 శాతానికిపైగా పడిపోయింది. నెల రోజుల్లో, 6 నెలల్లో కూడా నష్టాల్నే మిగిల్చింది.


ఇవాళ 5 శాతం పడిపోవడంతో ఇందులో షేర్లు కొనుగోలు చేసిన వారికి నష్టాలు వచ్చాయని చెప్పొచ్చు. అయితే స్టాక్ పడిపోవడానికి ప్రధాన కారణం.. ఇటీవల అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కంపెనీ ప్రకటించిన క్యూ3 ఫలితాలే అని చెప్పొచ్చు. ఈ సమయంలో డీమార్ట్ లాభం అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే 4.7 శాతం పెరిగి రూ. 723 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా 17.68 శాతం పెరిగి రూ. 15,972.55 కోట్లకు చేరింది. అంతకుముందు ఇదే సమయంలో ఆదాయం రూ. 13,572.47 కోట్లుగా ఉండేది.


అయితే లాభం, ఆదాయం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే పెరిగినప్పటికీ.. అంచనాల్ని మాత్రం తప్పింది. వాస్తవంగా ఇంతకంటే ఎక్కువ లాభాదాయాలు వస్తాయనుకుంటే అలా జరగలేదు. దీంతో పలు బ్రోకరేజీ సంస్థలు టార్గెట్ ప్రైస్ తగ్గించాయి. జెఫరీస్ ప్రస్తుతం డీమార్ట్ టార్గెట్ ప్రైస్‌ను రూ. 4225 కు కుదించింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గతంలో రూ. 4,750 గా టార్గెట్ ప్రైస్ ఉంచగా.. ఇప్పుడు దానిని రూ. 4450 కి తగ్గించింది. ఈ క్రమంలోనే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ స్టాక్ పతనం అవుతోంది.


 డీమార్ట్ అక్టోబర్- డిసెంబర్ సమీక్షా త్రైమాసికంలో కొత్తగా 10 స్టోర్లను తెరిచింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం స్టోర్ల సంఖ్య 387 కు చేరింది. ప్రస్తుతానికి 16.1 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ బిజినెస్ ఏరియా ఉంది. డీమార్ట్‌లో బేసిక్ హోమ్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్స్ అన్ని రకాలకు చెందినవి ఉంటాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఎన్‌సీఆర్, ఛత్తీస్‌గఢ్, దమన్ సహా దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల కార్యకలాపాల్ని విస్తరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com