భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)నూతన కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియమితులయ్యారు. ఆదివారం (జనవరి 12) బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో సభ్యులు.. సైకియాను బీసీసీఐ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే భేటీలో బీసీసీఐ కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియాను ఎన్నుకున్నారు. ఈ రెండు పోస్టులు వీరిద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో.. ఎన్నిక లాంఛనమే అయింది.
బీసీసీఐ కార్యదర్శిగా గత నాలుగేళ్లుగా జై షా బాధ్యతలు నిర్వర్తించారు. 2024 ఆగస్టులో జై షా ఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెలలో బాధ్యతలు చేపట్టారు. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఫలితంగా బీసీసీఐ కార్యదర్శి ఎంపిక అనివార్యమైంది. కొద్దిరోజులుగా జై షా స్థానంలో తాత్కాలిక కార్యదర్శిగా పనిచేస్తున్న దేవజిత్ సైకియా.. ఆదివారం నుంచి పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు.
ఇక ఇదే సమయంలో బీసీసీఐ కోశాధికారి పోస్టు కూడా ఖాళీ అయింది. ఇంతవరకు ఆ పోస్టులో ఉన్న ఆశిష్ షెలార్.. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన కూడా బీసీసీఐ కోశాధికారి పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా ఈ పోస్టు కోసం ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. దేవజిత్ సైకియా అస్సాంకు చెందిన వారు కాగా.. ప్రభ్తేజ్ సింగ్ భాటియాది ఛత్తీస్గఢ్.
బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారి ఎన్నికైన ప్రభ్తేజ్కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హెచ్సీఏ ప్రతినిధిగా హాజరై వీరి అభ్యర్థిత్వాన్ని ఆయన బలపరిచారు. ఎన్నిక తర్వాత ప్రత్యేకంగా వారిని కలిసి తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కోరారు. బీసీసీఐ సర్వసభ్య సమావేశం తర్వాత.. భారత క్రికెట్ బోర్డు నేడు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా తక్షణమే బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించింది.