తిరుమలలో వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించి అంతలోనే రాత్రికిరాత్రే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. వరుస ఘటనలపై నిగ్గు తేల్చేందుకు అధికారిని కేంద్రం పంపుతామంది. కానీ, విజయవాడకు వచ్చిన అమిత్ షాను చంద్రబాబు, పవన్ బతిమిలాడారని, అందుకే రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చారన్నారు హడావుడిగా ఇచ్చిన జీవోలో అధికారుల సంతకాలు కూడా లేవని తప్పుపట్టారు. తిరుమలలో ఎన్నడూ లేని ఘటనలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం ఏదో ఒకటి జరుగుతోందని భూమన ఆందోళన వ్యక్తం చేశారు.అధికారుల అలసత్వంతో.. అవినీతితో విచ్చలవిడితనం కనిపిస్తోంది. బ్రహ్మాండనాయకుడి కొండపై మద్యం, బిర్యానీలు లభ్యమవుతున్నాయి. తిరుమలలో నాలుగుసార్లు ఎర్రచందనం దొరికింది. మిమ్మల్ని చూసుకుని సప్లై చేస్తున్న దొంగలు ఎవరు? అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.