బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ కొత్త సినిమా ఎమర్జెన్సీ భారత దేశ యువత తప్పక చూడాల్సిన సినిమా అంటూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పారు. ఇటీవల ఈ సినిమా ప్రీమియర్ షో చూశానని, చరిత్రను చక్కగా చూపించిందని కంగనాను మెచ్చుకున్నారు. ఈ సినిమాతో కంగన సినీ ప్రయాణంలో మరో మెట్టు ఎక్కిందని ప్రశంసించారు. ప్రస్తుతం యువత పాఠ్యపుస్తకాల వరకే పరిమితం అవుతోందని, వారికి భారత చరిత్రలో చాలా విషయాలు తెలుసుకునే అవకాశం కలగడంలేదని సద్గురు చెప్పారు. అలాంటి వారికోసం భారత దేశ ఇటీవలి చరిత్రను కళ్ల ముందు నిలిపేలా ఎమర్జెన్సీ సినిమాను చిత్రీకరించారని తెలిపారు.ఎమర్జెన్సీ సమయంలో తాను యూనివర్సిటీ విద్యార్థినని సద్గురు చెప్పారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలు తనలాంటి వారికి ప్రత్యక్ష అనుభవం.. కానీ యువతకు ఆ వివరాలు తెలియవని, పాఠ్యపుస్తకాలలోనూ దాని గురించి అతి తక్కువ సమాచారమే ఉందని అన్నారు. ఈ సినిమాలో కంగన చాలా విషయాలను చూపించారని సద్గురు మెచ్చుకున్నారు. కాగా, ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా స్వయంగా కంగనానే చూసుకున్నారు. సద్గురు రివ్యూపై కంగన స్పందిస్తూ.. సద్గురు ఇచ్చిన కాంప్లిమెంట్ కు మించిన ప్రశంస ఇంకేదీ లేదని, తన హృదయం ప్రేమతో నిండిపోయిందని కంగనా రనౌత్ పేర్కొన్నారు.