ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని టీడీపీలో పలువురు సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి తొలుత లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ ప్రతిపాదనను సమర్థించారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే డిమాండ్ వినిపించారు.ఉపముఖ్యమంత్రి పదవికి నారా లోకేశ్ వందశాతం అర్హుడని చెప్పారు. ఈమేరకు ఆదివారం సోమిరెడ్డి ట్వీట్ చేశారు. రాజకీయంగా లోకేశ్ ఎన్నో డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. యువగళం పాదయాత్రతో తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారని తెలిపారు. లోకేశ్ బాబు పోరాటపటిమను చూసి టీడీపీ కేడర్ తో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా ఆయన నాయకత్వానికి జైకొట్టిందని చెప్పారు. అన్ని అర్హతలు ఉన్న నారా లోకేశ్ పేరును ఏపీ డిప్యూటీ సీఎం పదవికి పరిశీలించాలంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.