అమిత్ షా పని తీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2014లో NDRF కార్యాలయం కోసం శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. 2018లో ఇక్కడ NIDM కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశామని చెప్పారు. వీటికోసం ఏపీ ప్రభుత్వం యాభై ఎకరాలు కేటాయించిందని అన్నారు. నేడు మళ్లీ ఎన్డీఏ హయాంలోనే వీటిని ప్రారంభించామన్నారు. ఎటువంటి విపత్తు వచ్చినా సమర్ధవంతంగా NDRF పని చేస్తుందన్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలను వారు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడారని చెప్పారు.నీరు, భూమి, ఆకాశం ఎక్కడైనా వారు సేవలు అందించడంలో ముందుంటారని తెలిపారు. హుద్ హుద్ తుఫాన్, విజయవాడ వరదల సమయంలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సారథ్యంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. సిబ్బందికి అవసరమైన అన్ని వనరులు ప్రభుత్వం పరంగా అందించారని వెల్లడించారు. టెర్రరిస్టు, నక్సలైటు, ఇతర సమస్యలను అమిత్ షా బాగా పరిష్కరించారని సీఎం చంద్రబాబు తెలిపారు.