తెలుగు చలనచిత్ర రంగానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అని త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి అన్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి, ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌ను మించిన నటుడు లేరని, ప్రజలు ఆయన్ను దైవంలా కొలిచేవారని గుర్తు చేసుకున్నారు. రూ.2కు కిలో బియ్యం, ఆస్తిలో మహిళలకు సమాన హక్కును కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని తెలిపారు. సాంఘిక చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు చేసిన పాత్రలు చిరకాలం గుర్తుండిపోతాయన్నారు. గౌరవ అతిథి సినీనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ శ్రీకృష్ణుడు అంటే మనందరికీ ఎన్టీఆరే గుర్తొస్తారని తెలిపారు. మరో గొప్ప నటుడు ఏఎన్నార్ పెద్దగా చదువుకోలేదని, అయినప్పటికీ ఆయన జీవితాన్ని సంపూర్ణంగా చదువుకున్నారని వివరించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ సభలో నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు వై.వి.ఎ్‌స.చౌదరి, విజ్ఞాన్ విద్యాసంస్థల ఉపాధ్యక్షురాలు లావు రాణి రుద్రమదేవి, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో కవి అందెశ్రీ, సాహితీవేత్త ఖాదర్ మొహియుద్దీన్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం, ఒక్కొక్కరికి రూ.2లక్షల నగదు, జ్ఞాపిక అందజేశారు. అలాగే స్వర్ణభారతి ట్రస్ట్ చైర్మన్ ఇమ్మణ్ణి దీపా వెంకట్‌కు, స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమ నిర్వాహకులు డి.ఆర్.కె.ప్రసాద్, పద్మావతి దంపతులకు, వైద్య ప్రముఖులు పోలిచర్ల హరినాథ్ (అమెరికా)కు లోక్‌నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు.