మాదాసి కురువ/మాదారి కురువ సామాజికవర్గానికి చెందినవారికి కులధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు వీలుగా తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్‌లకు అధికారాలను కల్పిస్తూ 2022 నవంబరు 2న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 53ను హైకోర్టు రద్దు చేసింది. ఆ సామాజికవర్గానికి ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ స్థాయిలో కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని, మండలస్థాయిలో జారీ చేయడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తుచేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. జీవో 53ను సవాల్ చేస్తూ మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, మాలమహానాడు సీమ జిల్లాల అధ్యక్షుడు చలువాది రంగయ్య తదితరులు పిటిషన్ దాఖలు చేశారు.