వైసీపీ హయాంలో టీడీపీ జెండా కోసం జైలుకు వెళ్లినోళ్లు, రోడ్డుపై పోరాడినోళ్లు, ఆర్థికంగా నష్టపోయినోళ్లు అక్కడే ఉన్నారు. నిన్న మొన్న వచ్చిన వైసీపోళ్లు బాగుపడుతున్నారు. వారికే పదవులు, పనులు ఇస్తున్నారు. ఇందుకోసమేనా యువనేత లోకేశ్ పాదయాత్ర చేసింది? ఇందుకోసమేనా అధినేత చంద్రబాబు అవమానాలు భరించింది? అక్రమ కేసులో జైలుకు వెళ్లింది?’ అని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకుని కర్నూలు నగరంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అంత కష్టపడి అధికారంలోకి వస్తే జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలుగా చెప్పుకొనే వాళ్లు చేస్తున్నదేమిటి? టీడీపీ జెండాలు మోసిన కార్యకర్తల దగ్గర రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పైగా లంచాలు తీసుకుని రేషన్ షాపుల డీలర్‌షి్‌పలు, ఇతర పనులు ఇస్తున్నారు. మన కార్యకర్తల దగ్గరే లంచం తీసుకుంటున్న వారిని ఏమనాలి? టీడీపీ కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతోంది. లంచం ఎవడిస్తే వారికే పనులు చేస్తారా? పదవులు ఇస్తారా?’ అంటూ ఘాటుగా స్పందించారు. ‘‘వైసీపీ నాయకుల అరాచకాలపై ప్రాణాలకు తెగించి పోరాడి, బుల్లెట్ గాయాల పాలయ్యాను. ఓడిపోయి ఇన్చార్జిలుగా చెప్పుకునేవాళ్లు ఎంపీని కట్టడి చేస్తారా..? చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌కు తెలిస్తే బాధపడతారు. ఎన్నికల్లో ఏ లీడరు ఎలా పనిచేశాడు..? ఏ కార్యకర్త ఎలా కష్టపడ్డారు..? పని చేసినోళ్లకు గుర్తింపు ఇస్తున్నామా..? ఆత్మపరిశీలన చేసుకోవాలి. జిల్లాలో వాస్తవ పరిస్థితులను చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్తా. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అది నా బాధ్యత. లేదంటే పార్టీని మోసం చేసిన వ్యక్తిగా మిగిలిపోతా’ అని తిక్కారెడ్డి పేర్కొన్నారు.