ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం నాడు లేఖ రాశారు. ఢిల్లీలోని పారిశుధ్య కార్మికులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు సబ్సిడీపై భూమి కేటాయించాలని ఆ లేఖలో కోరారు. దీనిపై మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, కేంద్రం భూమి కేటాయిస్తే ఢిల్లీ ప్రభుత్వం శానిటేషన్ వర్కర్లకు ఇళ్లు కట్టించి ఇస్తుందని చెప్పారు.''పారిశుధ్య కార్మికులు మురికివాడల్లో నివసిస్తుండటం చూశాను. దీనిపై ప్రధానికి లేఖ రాశాను. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక స్కీమ్ ప్రవేశపెట్టాలని కోరారు. ఆ పథకం కింద సబ్సిడీతో భూములను కేంద్రం కేటాయిస్తే అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం వారికి ఇళ్లు కట్టించి ఇస్తుంది'' అని కేజ్రీవాల్ తెలిపారు. తొలుత ఎన్‌డీఎంసీ, నిగం నగర్ పారిశుధ్య కార్మికులకు కేంద్రం భూమి కేటాయిస్తే, వారి వేతనాల నుంచి ఇన్‌స్టాల్‌మెంట్లుగా ఆ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుందని చెప్పామని అన్నారు. ఇది పేద ప్రజలకు ఉద్దేశించిన పథకం అయినందున ప్రధాని అంగీకరిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇది పూర్తయిన తర్వాత మిగితా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయవచ్చునని అన్నారు.