పదిహేనేళ్ల క్రితం నాటి పాలకులు, అధికారులు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్బవరం పరిధిలోని వంగలి రైతులు, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఎదుట చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. సుమారు 400 మంది రైతులు వర్సిటీ మెయిన్ గేటు ఎదుట శిబిరం ఏర్పాటు చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు లోపలికి వెళ్లకుండా వాహనాలను అడ్డంగా పెట్టారు. అంతకుముందు గ్రామ పెద్దలు, యూనివర్సిటీ అధికారులు, పెందుర్తి ఎమ్మెల్యే సమక్షంలో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో ధర్నాను కొనసాగిస్తున్నట్టు సర్పంచ్ ఆకుల శ్రీహేమ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 15 సంవత్సరాల క్రితం ఐఎంయూ ఏర్పాటుకు తమ గ్రామంలో 110 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చామని, నిర్వాసిత రైతులు లేదా వారి పిల్లలకు అర్హతలనుబట్టి వర్సిటీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నాడు అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. భూములు ఇచ్చిన రైతులందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.50 వేలు ఇస్తామని అప్పటి జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఈ హామీలను ఇంతవరకు అమలు చేయకపోవడంతో భూములు ఇచ్చిన రైతులు ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు అధికారులు, పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మూడు రోజుల క్రితం ఆందోళన ప్రారంభించామని తెలిపారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు సమక్షంలో వర్సిటీ అధికారులతో జరిగిన చర్చల్లో తమ డిమాండ్లు పరిష్కారానికి రాత పూర్వకంగా హామీ ఇవ్వకపోవడంతో ఆందోళనను కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆకుల గణేశ్, జెట్టి ప్రసాద్, ముత్యాలనాయుడు, గొర్లి అప్పలనాయుడు, జెట్టి శ్రీను, నర్సింగరావు, గవర అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.