అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. మొదటి రోజే దూకుడుగా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వంలోని నలుగురు సీనియర్ అధికారులను పదవుల్లోంచి తొలగించారు. మరో వెయ్యి మంది ఉద్యోగులను కూడా తొలగిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే పదవులు కోల్పోయిన ఈ నలుగురు అధికారులు ఎవరు, మరో వెయ్యి మందిని కూడా ట్రంప్ ఎందుకు హెచ్చరించాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకే.. ఈ తొలగింపులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రోజు తెల్లవారుజామున గత ప్రభుత్వం నియమించిన నలుగురు సీనియర్ ప్రభుత్వ అధికారులను తొలగించారు. అలాగే అధ్యక్ష కార్యాలయం ప్రస్తుతం అధికారుల వడపోత పనులు చూస్తోందని సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ట్రంప్ వెల్లడించారు. ముఖ్యంగా అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ పనులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి అనుగుణంగా లేని గత ప్రభుత్వం చేత నియమించబడిన అనేక మందిలో 1000 మందిని కూడా త్వరలోనే తొలగిస్తామని రాసుకొచ్చారు.
నేడు నలుగురే.. మున్ముందు వెయ్యి మంది తొలగింపు
తాజాగా పదవుల్లోంచి తొలగించబడ్డ నలుగురు అధికారుల్లో ప్రెసిడెంట్స్ కౌన్సిల్ ఆన్ స్పోర్ట్స్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రీషన్ నుంచి జోస్ ఆండ్రెస్, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ కౌన్సిల్ నుచి మార్క్ మిల్లీ, విల్సన్ సెంటర్ ఫర్ స్కాలర్స్ నుంచి బ్రియాన్ హుక్, ప్రెసిడెంట్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ నుంచి కైషా లాన్స్ బాటమ్స్ ఉన్నట్లు తెలిపారు. అలాగే మరో వెయ్యి మందిని కూడా త్వరలోనే తొలగిస్తామంటూ హెచ్చరించారు.
ఇవి మాత్రమే కాకుండా ట్రంప్ మొదటి రోజే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన తన మద్దతు దారులు 1600 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అలాగే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులకు పుట్టబోయే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను కూడా విడుదల చేశారు. మరి తొలిరోజే ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్.. ముందు ముందు ఏం చేయబోతున్నారో చూడాలి.