సివిల్స్ లో విజయం సాధించాలని దేశవ్యాప్తంగా లక్షలమంది నిరుద్యోగులు కలలు కంటుంటారు. దేశంలోనే అత్యంత కష్టమైన ఉద్యోగాలలో సివిల్స్ ఒకటి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే మూడు విభాగాల్లో అత్యుత్తమ స్థాయిలో రాణించాలి.ఫస్ట్ రౌండ్ లో ప్రిలిమ్స్ , ఆ తర్వాత మెయిన్స్ రాత పరీక్ష, చివరగా ఇంటర్య్వూ.. ఇలా మూడు స్టేజ్ లు దాటితేనే సర్వీసు వస్తుంది. వీటిల్లో ఏ ఒక్క విభాగంలో ఫెయిల్ అయినా.. మళ్లీ ప్రిలిమ్స్ నుంచి కసరత్తు మొదలు పెట్టాల్సిందే. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం ఉద్యోగార్థులు ఏళ్లు తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సివిల్స్ లో విజయం సాధించిన వారు.. తమ ప్రతిభ ఆధారంగా చీఫ్ సెక్రటరీ స్థాయి వరకూ చేరుకోవచ్చు.సివిల్ సర్వీసెస్ పరీక్ష-2025కు సంబంధించిన తేదీలను యూపీఎస్సీ తాజాగా వెల్లడించింది. ఈనెల 22 నుంచి అప్లికేషన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్ కు చివరి తేదీగా ఉంది. పేమెంట్ కు చివరి తేదీ ఫిబ్రవరి 11 వరకు ఉంది. మొత్తం ఖాళీల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈసారి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు వెయ్యికి పైగా పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి ఖాళీల సంఖ్య ఈనెల 22 న వెలువడనుంది.
పరీక్ష తేదీ యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25న జరగనుంది. అభ్యర్థులు హాల్ టికెట్లను పరీక్షకు 7 రోజుల ముందు నుంచి అధికారిక వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్హత : అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 21 నుంచి 32 వరకు ఉంటుంది. ఆయా వర్గాలకు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 100 గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు
ప్రిలిమ్స్ పరీక్ష విధానం: ప్రిలిమ్స్ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ కాగా, పేపర్ 2 లో ఇంగ్లీష్, రీజనింగ్ ఉంటుంది. రెండో పేపర్ లో కనీస మార్కులు పొందితేనే పేపర్ 1 మూల్యాంకనం ఉంటుంది. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.మెయిన్స్ : మెయిన్స్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో రాణించిన వారికి రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం, వరంగల్
మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, విజయవాడ