2014–19 మధ్య చంద్రబాబు వరుసగా నాలుగేళ్లు, ఆయన కొడుకు లోకేశ్ ఒకసారి దావోస్ వెళ్లొచ్చారు. ఆ ఐదేళ్లూ పెట్టుబడుల పేరుతో ఎల్లో మీడియాలో ఆహా ఓహో అని డప్పుకొట్టడమే తప్ప.. ఆ పత్రికలు రాసిన ఒక్క ప్రాజెక్టు కూడా వచ్చింది లేదు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. అయన మాట్లాడుతూ.... ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము ధారబోశారు. ఇది చాలదన్నట్టు ఈసారి జీవోలు ఇచ్చి మరీ నేషనల్ మీడియాకి కూడా కోట్లల్లో డబ్బులు ధారబోస్తున్నారు. స్టోన్ క్రాఫ్ట్ అనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ గోల్ఫ్ కోర్టు ఏర్పాటు చేస్తామని దావోస్ వెళ్లి లోకేశ్‌తో ఒప్పందం చేసుకుందని చెబుతున్నారు. ఇంతకన్నా చోద్యం ఇంకేదైనా ఉంటుందా? నిరుద్యోగులను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారు? అని ప్రశ్నించారు. అలానే... ఏ హంగామా లేకుండా 2022లో సీఎంగా దావోస్ సదస్సుకి వెళ్లిన వైయస్ జగన్ రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆ ఒప్పందాలన్నీ వాస్తవ రూపంలో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. టెక్ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ రూ.200 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ఆదాని గ్రూప్ రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో వస్తే భూములు కేటాయించాం. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.37 వేల కోట్ల పెట్టుబడులతో వచ్చిన గ్రీన్ కో కంపెనీకి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భూములు కేటాయించడం, ఉత్పత్తి కూడా ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. ఇటీవలే ఆ కంపెనీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రాజెక్టు అని ప్రశంసించారు. ఇవే కాకుండా రూ.28 వేల కోట్లతో అరబిందో సంస్థ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌కు ఒప్పందం చేసుకుంటే ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఆయా కంపెనీల కారణంగా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వివరించారు.