నిరుపేదల సొంతింటి కల సాకారం కోసం గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కాలనీల పేరుతో ఏకంగా మినీ సిటీలనే నిర్మించిందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31.70 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో పేదలెవరు ఉండకూడదన్నట్లుగా ఇళ్ల స్థలాలను రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మంగళవారం నున్న, సూరంపల్లిలో జగనన్న కాలనీలను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గృహ యజమానులు తెలిపారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23,490 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. తొలిదశలో 14,986 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. 2,712 ఇళ్లు పూర్తి అయ్యాయి. మరో 2 వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని 8,504 మంది పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించామన్నారు. అమరావతిలో పేదలెవరు ఉండకూడదనే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్లన్నింటినీ పాడుబెడుతోంది అని మల్లాది విష్ణు మండిపడ్డారు. పైగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇస్తామని కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. నిర్దాక్షిణ్యంగా ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, మరోవైపు అద్దెల భారంతో లబ్ధిదారులు ఆర్థిక వెతలను ఎదుర్కొంటున్నారు. తక్షణమే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలి. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి. లేనిపక్షంలో పేదల తరపున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుందని మల్లాది విష్ణు హెచ్చరించారు.