ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో పుట్టే అక్రమ వలసదారుల పిల్లలకు జన్మతః పౌరతసత్వం రద్దు.. ఎప్పటి నుంచంటే?

international |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2025, 09:48 PM

అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడే స్థిపరడాలని చాలా మంది కలలు కంటారు. ఈక్రమంలోనే అనేక దేశాలకు చెందిన ప్రజలు అక్కడకు వెళ్లి జీవిస్తుంటారు. వారికి అక్కడి పౌరసత్వం లభించకపోయినా.. అక్కడ వారికి పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అమెరికా పౌరసత్వం లభించేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతిని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. యూఎస్‌కు వలస వచ్చిన వారికి అక్కడే పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. కానీ అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తుందని చెబుతూనే.. నూతన అధ్యక్షుడు ట్రంప్ దీన్ని రద్దు చేశారు. అక్రమ వలసదారులకు తమ గడ్డపై పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ తెలిపారు. అమెరికా ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.


అయితే 150 ఏళ్లుగా అమల్లో ఉన్న ఈ జన్మతః పౌరసత్వాన్ని తాజాగా రద్దు చేయడంతో.. అసలు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ఏం చెబుతుందో తెలుసుకోవాలని అంతా ప్రయత్నాలు చేస్తున్నారు. 1868లో 14వ రాజ్యంగ సవరణ కింద ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చింది. తమ దేశంలో జన్మించే ప్రతీ ఒక్కరికి జన్మతః పౌరసత్వం లభిస్తుందని వెల్లడించింది. ముఖ్యంగా టూరిస్ట్, స్టూడెంట్ వీసాలపై వచ్చే వారికి అక్కడ పిల్లలు పుట్టినా ఈ నియమం వర్తించేది.


కానీ దీన్ని రద్దు చేసిన ట్రంప్ సర్కారు.. ఎలాంటి సందర్భాల్లో వలసదారులకు పుట్టే పిల్లలకు జన్మతః పౌరసత్వం లభిస్తుందో వెల్లడించింది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా అమెరికా పౌరసత్వం ఉంటేనే.. వారి పిల్లలకు కూడా యూఎస్ సిటిజెన్‌షిప్ లభిస్తుంది. లేదా తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు అమెరికాలో ఉంటున్నట్లు చట్టబ్ధమైన శాశ్వత నివాస హక్కును పొంది ఉండాలి. ఇది కూడా లేని పక్షంలో పేరెంట్స్‌లో ఒకరు అమెరికా మిలటరీలో సభ్యుడైనా అయి ఉండాలి. పైన చెప్పిన వాటిల్లో ఒక్క హక్కు కూడా లేకపోతే వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు.


అలాగే ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి 30 రోజుల తర్వాత ఈ మార్గదర్శకాలను అమలు చేస్తారని కూడా ఫెడరల్ ప్రభుత్వం వెల్లడించింది. అంటే ఫిబ్రవరి 20 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. కార్యనిర్వాహణ అధికారులు, ఏజెన్సీ సంబంధిత అధికారులు ఈ ఆదేశాల అమలును పరిశీలిస్తారని చెప్పుకొచ్చింది. అయితే ఈ తాజా ఉత్తర్వులను అమలు చేయడం అంత తేలికైన వ్యవహారం కాదని నిపుణులు చెబుతున్నారు.


ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రావాలంటే.. అమెరికా రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణకు సెనేట్, హౌస్‌లో 2/3వ వంతు మెజార్టీ రావాలి. అమెరికాలోని 3/4వ వంతు రాష్ట్రాలు కూడా దీనికి ఆమోదం తెలపాల్సి ఉంది. చారిత్రకంగా చూస్తే.. అమెరికా సుప్రీం కోర్టు జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వ హక్కుకు మద్దతు పలికింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com