ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో కీలక మార్పులు రానున్నాయి. ఈపీఎఫఓలో సభ్యులుగా ఉన్న కోట్లాది మందికి వివిధ సేవలు మరింత సులభంగా అందనున్నాయి. ఈపీఎఫ్ఓ కొత్త విధానం అమలులోకి రాబోతోంది. ఈ ఏడాది జూన్ నెలలోనే ఈపీఎఫ్ఓ 3.0 అమలులోకి తీసుకొస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయా ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో ఇక ఈపీఎఫ్ చందాదారులు తమ పీఎఫ్ డబ్బులను ఏటీఎం నుంచే విత్ డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం కొత్త యాప్ సహా అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఈపీఎఫ్ఓలో కొత్త సాఫ్ట్‌వేర్ వ్యవస్థ ఈపీఎఫ్ఓ 3.0 ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కొత్త సిస్టమ్ అందుబాటులోకి వస్తే ఉద్యోగులకు చాలా సేవలు సులభంగా లభిస్తాయని, యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో మానవ జోక్యం లేకుండానే పీఎఫ్ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. స్వీయ అప్రూవల్‌తోనే నేరుగా ఏటిఎం కేంద్రం నుంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. తమ క్లెయిమ్స్ ఒకే క్లిక్‌తో సెటిల్ చేసుకునేందుకు అనుమతిస్తుందన్నారు.
ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా చందాదారులందరికీ ప్రత్యేక ఏటీఎం కార్డులను జారీ చేస్తామని కేంద్రం మంత్రి తెలిపారు. ఈ కార్డు ద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెండ్ ఫండ్ ఖాతా నుంచి డబ్బులు ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. ఆర్థికంగా అత్యవసరం ఏర్పడినప్పుడు ఈ కొత్త సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఏటీఎం నుంచి విత్ డ్రా కోసం కొత్త సాఫ్ట్‌వేర్ నెల రోజుల్లోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది జూన్ నుంచి దేశవ్యాప్తంగా ఏటీఎం విత్ డ్రా సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈపీఎఫ్ఓ 3.0ను దశల వారీగా అమలు చేయనున్నారు.
ఈపీఎఫ్ఓ 3.0 కింద కొత్త మొబైల్ యాప్, ఇతర డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2025, జూన్ నాటికి ఈ కొత్త యాప్, ఏటీఎం కార్డులు, కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటుగా ప్రస్తుతం అమలవుతున్న 12 శాతం కంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఉద్యోగులు తమ పొదుపు ప్రణాళికలకు అనుగుణంగా పీఎఫ్‌కి డబ్బులు జమ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్‌లో జమ చేసే డబ్బులను పెన్షన్‌గా మర్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి తెలిపారు.