ఏపీ మంత్రి నారా లోకేశ్ విశాఖ కోర్టు ముందు ఇవాళ హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు వెళ్లనున్నారు. ఓ పత్రిక ''చినబాబు చిరుతిండి..25 లక్షలండి'' అంటూ 2019లో నారా లోకేశ్ పై కథనం ప్రచురించింది. ఈ కథనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్.. సదరు పత్రికపై రూ.75కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో జరగనుంది. ఈ సందర్భంగా క్రాస్ ఎగ్జిమినేషన్ కోసం లోకేశ్ కోర్టుకు హాజరు కానున్నారు.2019లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఓ పత్రిక తనపై అసత్యాలు, కల్పితాలతో కథనాన్ని ప్రచురించారని నారా లోకేశ్ కోర్టులో పిటిషన్ వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్ లో లోకేశ్ పేర్కొన్నారు. పలు తేదీల్లో తాను విశాఖలో ఉన్నానని సదరు పత్రిక తన కథనంలో పేర్కొందని, ఆ సమయంలో తాను విశాఖలోనే లేనని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చే అతిథులకోసం చేసిన ఖర్చును తనకు అంటగడుతూ తన ప్రతిష్టను మంటగలిపేందుకు ప్రయత్నించారని లోకేశ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖ వెళ్లానని, ఎయిర్ పోర్టులో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని కోర్టుకు లోకేశ్ తెలిపారు.పరువు నష్టం దావా కేసుకు సంబంధించి విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో ఇవాళ క్రాస్ ఎగ్జిమినేషన్ కు లోకేశ్ హాజరు కానున్నారు. లోకేశ్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. దీంతో కోర్టు ఎలా స్పందిస్తుందనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రే విశాఖ పట్టణంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు స్థానిక పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. రాత్రి నగరంలోనే బస చేసిన లోకేశ్.. మరికొద్దిసేపట్లో కోర్టు ఎధుట హాజరుకానున్నారు.