కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు కొలంబియా దిగొచ్చినట్టు తెలుస్తోంది.అమెరికాకు అక్రమంగా వెళ్లిన కొలంబియా దేశస్థులను స్వీకరించేందుకు అంగీకరించిందని సమాచారం. కొలంబియా ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించక పోయినా అమెరికా మాత్రం ఈ మేరకు ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.తమ దేశంలోకి అక్రమంగా వలసొచ్చిన కొలంబియా వాసులను అమెరికా ఇటీవల రెండు సైనిక విమానాల్లో వారి మాతృదేశానికి పంపించింది. అయితే, కొలంబియా ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. విమానాలను తమ దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ట్రంప్ కొలంబియాపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శరణార్థులను వెనక్కు తీసుకోకుండా సుంకాలతో పాటు వీసా ఆంక్షలు కూడా విధిస్తామని హెచ్చరించారు.
కొలంబియా ఉత్పత్తులపై తనిఖీలు పెంచుతామని, 25 శాతం మేర సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, ప్రభుత్వ అధికారుల వీసాలపై కూడా ఆంక్షలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. ఈ క్రమంలోనే కొలంబియా దిగొచ్చినట్టు తెలుస్తోంది.
అమెరికా తప్పి పంపించిన శరణార్థులను స్వీకరించేందుకు కొలంబియా అంగీకరించిందని శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది. అక్రమవలసదారులు అందరినీ స్వీకరించేందుకు కొలంబియా అంగీకరించిందని వెల్లడించింది. శరణార్థులను తీసుకొస్తున్న అమెరికా మిలిటరీ విమానాలపై ఎటువంటి ఆంక్షలు, జాప్యం ఉండదని అక్కడి ప్రభుత్వం పేర్కొన్నట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ సెక్రెటరీ కెరొలీన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కట్టుబడి ఉన్నారన్నారు. మిగతా దేశాలు కూడా ఆమెరికా ప్రయత్నాలకు ఇలాగే సహకరించాలని ట్రంప్ కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు విధించకపోయినా వీసా ఆంక్షలు, పోర్టుల్లో తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇక అమెరికాతో వాణిజ్యం నెరపుతున్న లాటిన్ అమెరికా దేశాల్లో కొలంబియా మూడో అతిపెద్దది.