అమిత్ షా ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏపీకి రూ.3 లక్షల కోట్లు కేంద్రం ద్వారా సాయం అందించామని ప్రకటించారు. చంద్రబాబు ఇప్పటివరకు రూ.1.19 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పారు. అంటే ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి అందిన నిధులు మొత్తం రూ.4.19 లక్షల కోట్లు. నెలకు దాదాపు రూ.50 వేల కోట్లు. ఈ నిధులు ఏం చేశారు? ఏ పథకం కింద ప్రజలకు ఎంత సొమ్ము అందించారు? అని మాజీ మంత్రి, వైయస్‌ఆర్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ.... వీటికి సంబంధించిన లెక్కలు వెల్లడించండి. ఆర్థిక అరాచకత్వం ఈ రాష్ట్రంలో నడుస్తోంది. ఒకవైపు అభివద్ధి లేదు, మరోవైపు సంక్షేమం కనిపించడం లేదు. నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్నారు. చివరికి జగన్ గారు సీఎంగా ఉండగా వాట్సాప్ లో గవర్నెన్స్ ను తీసుకువచ్చారు.
పదిహేను రోజుల కాలంలో కోటి సర్టిఫికేట్ లను ఇంటింటికీ తీసుకువెళ్ళి అందించారు. దానిని కాపీ చేసి నేడు లోకేష్ వాట్సప్ గవర్నెన్స్ ను తానే కనిపెట్టినట్లు, ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. జగన్ గారి పాలన సింప్లిసిటీ అయితే చంద్రబాబు పాలన పబ్లిసిటీ. 2022లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతోంది, అప్పుల ఊబిలోకి వెడుతోందంటూ గుండెలు బాదుకున్నారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ మాట్లాడుతూ మేం ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని అడగాలని అన్నారు. ఇప్పుడు హామీలను అమలు చేయడం కుదరదంటున్న మీ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏం చేయాలి? ఏం చేస్తే హామీలను అమలు చేయడానికి సిద్దమవుతారు? అని ప్రశ్నించారు.