కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఇంకా హనీమూన్‌లోనే ఉండటం సరికాదని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకొని నిలదీయమన్నారని, ఎవరి కాలర్ పట్టుకోవాలో కూటమి నేతలు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తుంటే 2022లో చంద్రబాబు, పవన్ ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందని, దీవాళ తీస్తుందని మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో కూటమి నేతలు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టారని, మేమిచ్చిన హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమని లోకేష్ చెప్పారని గుర్తు చేశారు.
ఇవాళ చంద్రబాబు ఆర్థిక పరిస్థితి బాగోలేదని, సంపద సృష్టించిన తరువాత సూపర్ సిక్స్ అమలు చేస్తామని చేతులేత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఏం చేస్తే మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. వైయస్ జగన్ తన పాలనలో విద్యా, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారని, చంద్రబాబు ప్రాధాన్యత ఏంటో చెప్పాలన్నారు. ఎన్నికల హామీలు గాలికి కొట్టుకుపోయాయని, సంక్షేమ పథకాలు అందక ప్రజలు అయోమయంలో ఉన్నారని చెప్పారు. 8 నెలలైనా ఇంకా హనీమూన్‌లో ఉండటం సరికాదని హితవు పలికారు. దావోస్‌కు వెళ్లడం అనేది అన్నది ఒక అద్భుతమైన ఘట్టమన్నట్లు చంద్రబాబు, లోకేష్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇవాళ ఒక్క ఎంవోయూ కూడా చేసుకోకుండా ఏపీకి తిరిగి వచ్చారని తప్పుపట్టారు. వైయస్ జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించారని, అప్పులపాలు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం చేసి, వైయస్ జగన్ మళ్లీ రారని పారిశ్రామికవేత్తలు గ్యారెంటీ అడుగుతున్నారని లోకేష్ చెప్పడం సిగ్గుచేటని కన్నబాబు ఫైర్ అయ్యారు.