అగ్రరాజ్యం అమెరికాలో మరో విమాన ప్రమాద సంభవించింది. బుధవారం రోజు వేకువజామునే ఓ ఆర్మీ హెలికాప్టర్, పౌర విమానం ఢీకొని.. 67 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో ప్రమాదం జరగడంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈసారి జరిగిన ప్రమాదంలో ఇద్దరితో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. ముఖ్యంగా ఫిలడెల్ఫియాలోని ఓ షాపింగ్ మాల్ వద్ద ఈ విమానం పడిపోగా.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీని వల్ల అనేక భవనాలు, కార్లు, ఇళ్లు దగ్ధం అయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపిన వివరాల ప్రకారం.. లియర్ జెట్ 55 ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి మిస్సౌరీలోని స్ర్పింగ్ ఫీల్డ్ - బ్రాన్సన్ నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్తోంది. అయితే లియర్ జెట్ టేకాఫ్ అయిన కాసేపటికే (సాయంత్ర 6.30) విమానం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా ఫిలడెల్ఫియాలోని ఓ షాపింగ్ మాల్ వద్ద కుప్పకూలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈక్రమంలోనే అనేక భవనాలు, కార్లు పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది.
అయితే విమాన ప్రమాదం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది సైతం మంటలు ఆర్పే పనిలో పడింది. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు మాత్రమే ఉన్నారని.. కానీ కూలిపోయి మంటలు చెలరేగడంతో మరికొంత మంది కూడా ప్రాణాలు కోల్పోయారని పలువురు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదం వల్ల ఎంత మంది చనిపోయారనేది అమెరికా అధికారికంగా ప్రకటించలేదు.
విమాన ప్రమాదంపై స్పందించిన కామన్‌వెల్త్ ఆఫ్ పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాప్రియో మాట్లాడుతూ.. తాను ఫిలడెల్ఫియా మేయర్‌తో మాట్లాడానని.. పరిస్థితిని నిశితంగా అంచనా వేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బాధితులకు సాయం చేస్తూ ఆస్పత్రులకు తరలిస్తున్నామని.. మంటలు ఆర్పేందుకు కూడా పెద్ద ఎత్తునే ఏర్పాట్లు సాగుతున్నాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదం వల్ల ఎంత మంది చిపోయారు, మరెంత మంది గాయపడ్డారనేది మాత్రం తెలపలేదు.
బుధవారం రోజు వాషింగ్టన్ డీసీలో రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ ఆర్మీ హెలికాప్టర్.. పౌర విమానాన్ని ఢీకొట్టింది. గాల్లో ఉండగానే ఈ ఘటన జరగగా.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆపై హెలికాప్టర్, విమానాలు కింద ఉన్న పొటామక్ నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదం వల్ల మొత్తంగా 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన రెండు రోజులకే మరో ప్రమాదం జరగడంతో అమెరికా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.