ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా లో నేడు వసంత పంచమి సందర్భంగా అమృతస్నానాలకు భక్తులు క్యూ కట్టారు.సోమవారం తెల్లవారుజాము నుంచే త్రివేణీసంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వసంత పంచమి ని పురస్కరించుకొని సోమవారం 4 కోట్ల నుంచి 6 కోట్లమంది జనం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.మౌనీ అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెల్లవారుజామున 3.30 గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉదయం 6 గంటల్లోపే కొంతమంది అఖాడాలు అమృతస్నానాలు ఆచరించారు. నాగసాధువులు కూడా రానున్నారు.
త్రివేణీ సంగమం వద్ద భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. తెల్లవారుజామున 4 గంటల వరకు 16.58 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 34.97కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 144ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.జనవరి 29న మౌనీ అమావాస్యను పురస్కరించుకుని కుంభమేళాకు భక్తులు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. మరోవైపు, సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది.