మా నాన్న నందమూరి తారకరామారావుకు భారతరత్న రావాలన్నది అందరి కోరిక అని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘నాకు పద్మభూషణ్ వచ్చిన రోజుకంటే ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చిన రోజు ఎక్కువ సంతోషపడతా. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని చాలా నమ్మకంగా ఉంది. వస్తుంది. నేను నటించిన పాత్రలకు ప్రజలు ఆమోదం తెలిపినందుకే నాకు ఈ అవార్డు దక్కిందని అనుకుంటున్నా. పద్మభూషణ్ రావడంతో నాలో కసి పెరిగింది. నేను నటించే పాత్రలను సవాల్‌గా తీసుకుంటా. నా పాత్రకు నేనే చాలెంజ్. పదవులకు నేను అలంకరణేమో కానీ, పదవులు నాకు అలంకరణ కాదు. నా రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది’ అని బాలకృష్ణ అన్నారు.