గుంటూరు సీఐడీ అధికారుల ఎదుట విచారణకు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గైర్హాజరయ్యారు. ఈరోజు (సోమవారం) విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది. అయితే తాను సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనని నిన్ననే సీఐడీకి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు ఆర్జీవీ తరపున అతని న్యాయవాది నాని బాబు గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఎనిమిది వారాల పాటు విచారణకు హాజరుకాలేరని.. ఎనిమిది వారాల పాటు సమయం ఇవ్వాలని లిఖిత పూర్వకంగా సీఐడీ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై సీఐడీ అధికారులు ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై సీఐడీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా ఉందని ఆర్జీవీపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఆర్జీవీ విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఐడీ కూడా ఆర్జీవీని విచారించాలని నిర్ణయించింది. అయితే సీఐడీ విచారణకు దర్శకుడు గైర్హాజరవడంతో తదుపరి కార్యచరణ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
![]() |
![]() |