అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంలో తొలి విడతలో 104 మంది భారతీయులను వెనక్కి పంపించారు. ఇప్పుడు ట్రంప్ బాటలో యూకే కూడా పయనిస్తున్నట్టు అర్థమవుతోంది. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఉపాధి పొందుతున్న 600 మందికి పైగా వలసదారులను యూకేలో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... యూకేలో అక్రమ వలసలు పెరిగాయని చెప్పారు. చాలా మంది ఇక్కడ అక్రమంగా పనిచేస్తున్నారని తెలిపారు. చట్ట వ్యతిరేక వలసలకు ముగింపు పలుకుతామని చెప్పారు. గత ఏడాది జులైలో బ్రిటన్ లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ఇమిగ్రేషన్ అధికారులు వందల మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. వీరంతో రెస్టారెంట్లు, బార్లు, కార్ వాషింగ్ కేంద్రాలు, ఇతర స్టోర్లలో పని చేస్తున్నారు. కొన్ని క్రిమినల్ గ్యాంగ్ లు ప్రమాదకర మార్గాల్లో వీరిని యూకేకు తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. కొందరు ఇంగ్లీష్ ఛానల్ ను ఈదుకుంటూ దేశంలోకి వచ్చినట్టు తేలిందని చెప్పారు.
![]() |
![]() |