ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్-2047, పీ4 పాలసీ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక భరోసా, ప్రాథమిక రంగానికి రుణాలు, డ్వాక్రా రుణాలు, ముద్ర రుణాలు, పీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా, టిడ్కో ఇళ్లు, రూరల్ ప్రాంతాల్లోబ్యాంకింగ్ నెట్ వర్క్ విస్తరణ తదితర అంశాలపై బ్యాంకర్లతో చర్చించారు. ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు సహకరించాలని బ్యాంకర్లను కోరారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పనిచేసేందుకు ప్రభుత్వంతో బ్యాంకులు చేయి కలపాలని సూచించారు. అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ ప్రముఖ పాత్ర పోషించనుందని... హార్టీకల్చర్, ప్రకృతి వ్యవసాయ రంగాలకు బ్యాంకులు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా, బ్యాంకులు విజన్-2047కి అండగా నిలవాలని కోరారు.