ఒకపక్క అధిక పెట్టుబడులు, మరో పక్క అరకొర దిగుబడులు, నామమాత్రపు ధరలు వెరసి వైట్‌బర్లీ రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి. రోజురోజుకూ దిగజారుతున్న ధరలు అన్నదాతలను మానసిక వ్యధకు గురిచేస్తోంది. వేలకువేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. గత ఏడాది దిగుబడులతో పాటు ధరకూడా ఆశాజనకంగా ఉండడం, వైర్‌సతో మిర్చి, సరైన దిగుబడి లేక శగన దెబ్బతినడంతో ప్రత్యామ్నాయంగా వేల ఎకరాల్లో వైట్‌బర్లీ పొగాకును రైతులు సాగు చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వైట్ బర్లీ సాగు చేసుకున్న రైతులు కన్నీటి పర్యంతరం అవుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ధర సగానికి పడిపోవడం ఇందుకు కారణం. మల్లె వంటి సమస్యతో చాలా చోట్ల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. మొదటి వలుపు పొగాకు అమ్మితే సాగుకు అయిన ఖర్చులో కనీసం నాల్గోవంతు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఏమిచేయాలో పాలుపోని స్థితిలో వైట్‌బర్లీ రైతులు నిరాశలో మునిగిపోయారు. ప్రస్తుతం ఉన్న ధరతో పొగాకును చేలో వదిలి వేయలేక తీసుకు రావాల్సి వస్తుందని రైతులు దిగాలు చెందుతున్నారు. మరో పక్క మొదటి వలుపు పొగాకు క్వింటా ధర రూ.3వేలే అని ఒకరు కాదు రూ.4వేలని మరొకరు ఇలా దళారుల ధరల మాయాజాలంతో అసలు ధర ఎంత ఉందో అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. వ్యాపారులు, దళారుల మాయాజాలం నుంచి ప్రభుత్వం తమను కాపాడేందుకు చర్యలు తీసుకుంటే అప్పులఊబిలో చిక్కుకొని కోలుకోని విధంగా దెబ్బతింటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంతో ఎన్నడూ లేనివిధంగా వైట్‌బర్లీ సాగు విస్తీర్ణం ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీగా పెరిగింది. ఎకరానికి రూ.40-50 వేలు చెల్లించి సాగు కోకం భూములు తీసుకున్నారు. సాగుదారుల్లో అత్యధికం కౌలు దారులే. దున్నకం, ఎరువులు, నారు కొనుగోలు, నాటడం, పురుగు మందులు, ఆరుతడి తదితర పనుల కోసం ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న ధరకు పంట అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |