సూపర్ సిక్స్ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారంటూ గత కొంతకాలంగా వైసీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలో సమయంలో టీడీపీ కూటమి తరుఫున హామీలు ఇచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో పాటుగా ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ పథకాల అమలుపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శాసనసభ, శాసనమండలిలలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో వార్షిక బడ్జెట్‌పై సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు వార్షిక బడ్జెట్ మీద ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది నుంచే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని.. అందుకు తగిన విధంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ ఏడాదిలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలోనే ఆయా పథకాల అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులపై చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ రూపొందించాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.
మరోవైపు ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి పేరిట 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇలా హామీలు ఇచ్చారు. ఈ హామీల అమల్లో భాగంగా ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించింది టీడీపీ కూటమి సర్కారు. మిగతా హామీలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవను మే, జూన్ నెలల్లో ప్రారంభించనున్నట్లు తెలిసింది. అలాగే ఉగాది కానుకగా ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేరుస్తారనే ప్రచారం జరుగుతోంది.