దేశంలోని వివిధ ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా అనేక కోళ్లు, పక్షులు, జంతువులు మృత్యువాత పడగా.. తాజాగా మహారాష్ట్ర సర్కారే కోళ్లను చంపేస్తోంది. అలాగే బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే గుడ్లను సైతం నాశనం చేస్తోంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు చెబుతుండగా.. ప్రజలంతా తీవ్రంగా భయపడిపోతున్నారు. ఆ పూర్తి విశేషాలు మీకోసం.
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతమైన 7 ప్రాంతాలను గుర్తించింది. ఈక్రమంలోనే అక్కడ ఉన్న 7,200 కోళ్లను చంపేసింది. అలాగే 2 వేల 230 గుడ్లను నాశనం చేసింది. చంద్రపూర్ జిల్లాలోని మంగ్లీ గ్రామంలో తాజాగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిని చెందింది. ఈక్రమంలోనే అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఇప్పటికే 2,065 కోళ్లు చనిపోయాయి.
అయితే విషయం గుర్తించిన రాష్ట్ర పశుసంవర్థక శాఖ అధికారులు ప్రభావిత ప్రాంతం నుంచి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న అన్ని కోళ్లు, గుడ్లు, పశుగ్రాసాన్ని నాశనం చేయాలని నిర్ణయించింది. ఈక్రమంలోనే చంద్రాపూర్ జిల్లాలో 1,165 గుడ్లతో పాటు 50 కిలోల దాణాను నాశనం చేయించింది. అలాగే కోళ్ల పెంపకం దారులకు నష్ట పరిహారంగా రూ.2,91,963 అందించారు.
ఫిబ్రవరి 6వ తేదీ వరకు మహారాష్ట్రలోని లాతూర్, నాందేడ్, నాగ్‌పూర్, థానే, రాయ్‌గఢ్, చంద్రాపూర్ జిల్లాల నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 7 బర్డ్ ఫ్లూ ప్రభావిత కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ తాలూకాలో 71 కాకులు చనిపోయాయి. ఈక్రమంలోనే వీటికి పరీక్షలు చేయగా.. బర్డ్ ఫ్లూ కారణంగానే ఇవి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.
కేవలం కాకులు, కోళ్లలోనే కాకుండా పులులు, చిరుతలు, రాబందుల్లోనూ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు వివరించారు. అలాగే నాగ్‌పూర్‌లోని గోరేవాడ రెస్క్యూ సెంటర్‌లో ఉంచిన 3 పులులు, ఒక చిరుత పులి సహా 693 జంతువులు, పక్షలు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిట్లు తెలిపారు. ముఖ్యంగా ఇందులో మూడు తెల్లటి వీపు గల రాబందులు కూడా ఉన్నట్లు చెప్పారు.
పశుసంవర్థక శాఖ అధికారులు మాట్లాడుతూ.. వ్యవస్థీకృత పౌల్ట్రీ సంస్థల నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నివేదించబడలేదని తెలిపారు. కోళ్ల ఫాంల యజమానులు బయో భద్రతా చర్యలు చేపట్టారని.. ముఖ్యంగా కోళ్లు వలస పక్షులతో సంబంధంలోకి రాకుండా చూసుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వీటి వల్లే బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నివారించవచ్చని స్పష్టం చేశారు.
![]() |
![]() |