భారత్ ఇంకా ఐదోతరం యుద్ధ విమానం సమకూర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, చైనా సహా పలు దేశాలు ఆరో తరం యుద్ధ విమానం రూపకల్పనలో ముందంజ వేశాయని వార్తలు వస్తుండడడం తెలిసిందే. దీనిపై భారత రక్షణ దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఆసక్తికరంగా స్పందించారు. చైనా ఆరో తరం యుద్ధ విమానాన్ని రూపొందించినట్టు చెప్పుకోవడం పట్ల చాలా సందేహాలు ఉన్నాయని, బహుశా ఆ విమానం ఇంకా అభివృద్ధి దశలోనే ఉండొచ్చని తెలిపారు. చాలా దేశాలు ఆరో తరం యుద్ధ విమానం తయారీలో తలమునకలై ఉన్నాయని, తనకు తెలిసినంత వరకు ఆ దేశాలన్నీ యుద్ధ విమానం తయారీకి ఆమడ దూరంలో ఉన్నాయని అన్నారు. ఎక్కడో ఓ విమానాన్ని చూసి ఇదే ఆరో తరం యుద్ధ విమానం అని చెప్పుకుంటున్నామని, కొన్ని సెకన్ల వీడియో క్లిప్పింగ్ చూసి ఆరో తరం యుద్ధ విమానం అని నిర్ధారించలేమని సీడీఎస్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. అప్పుడెప్పుడో చైనా ఐదో తరం యుద్ధ విమానంలో డబ్ల్యూఎస్10, డబ్ల్యూఎస్15 ఇంజన్లను వాడిందంటూ వార్తలు విన్నామని... అంతలోనే ఆరో తరం యుద్ధ విమానం అంటున్నారని వ్యాఖ్యానించారు. భారత్ కూడా ఏఎంసీఏ (ఆమ్కా) పేరిట ఐదో తరం యుద్ధ విమానం తయారీలో నిమగ్నమై ఉందని వెల్లడించారు. అసలు, ఆరో తరం యుద్ధ విమానం అని దేన్ని పిలుస్తాం అనేందుకు అంతర్జాతీయంగా ఒక కొలమానం అంటూ ఏదీ లేదని... ప్రాథమికంగా ఆరో తరం యుద్ధ విమానం అంటే మానవ సహిత, మానవ రహిత ఛోదకశక్తితో కూడినది అయ్యుండాలని అనిల్ చౌహాన్ వివరించారు.
![]() |
![]() |