మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సోమవారం రోజు ఫ్రాన్స్ వెళ్లిన ఆయన.. ఈరోజు అమెరికాకు వెళ్లబోతున్నారు. ఈక్రమంలోనే భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ యూఎస్‌కు వెళ్లకముందే.. భారత దేశంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 12 మంది గ్యాంగ్‌స్టర్లను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలోనే వారందరి పేర్లతో ఓ జాబితాను తయారు చేసింది. దీన్ని అమెరికాకు అందించి వారందరినీ పట్టుకోబోతున్నట్లు సమాచారం. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అమెరికాలో తలదాచుకుంటూ.. భారత దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 12 మంది గ్యాంగ్‌స్టర్ల పేర్లతో భారత్ ఓ జాబితాను సిద్ధం చేసింది. ఇందులో జాతీయ దర్యాప్తు సంస్థ వాంటెడ్ లిస్టులో ఉన్న గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్, అమృతాల్ సింగ్, హర్జోత్ సింగ్, హర్బీర్ సింగ్, నవరూప్ సింగ్, దర్మాన్ కల్హాన్ అలియాస్ దర్మన్ జోత్ సింగ్ కహ్లోన్, స్వరణ్ సింగ్ అలియాస్ ఫౌజీ, సాహిల్ కైలాష్ రిటోలి, యోగేష్ అలియాస్ బాబీ బెరీ, భాను ప్రతాప్ సంబ్లీ, అమన్ సాంభి ఉన్నట్లు తెలుస్తోంది.
కొన్ని వారాల క్రితమే ఈ జాబితాను సిద్ధం చేయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయగా.. భద్రతా సంస్థలు తాజాగా ఈ జాబితాను రూపొందించాయి. ముఖ్యంగా ఈ జాబితా ఇప్పటికే సంస్థల వద్ద ఉండగా.. అమెరికాలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ల లిస్టును ప్రత్యేకంగా తయారు చేసింది. అయితే దీన్ని భారత్.. నేరుగా అమెరికాకు అందించబోతున్నట్లు తెలుస్తోంది. వారందరినీ తిరిగి భారత్ రప్పించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిక్ హత్య కేసుతో పాటు గతేడాది ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల కేసుల్లోను నిందితుడిగా ఉన్నాడు. అయితే నకిలీ పాస్‌పోర్ట్ సాయంతో ఆయన అమెరికాకు పారిపోయాడు. ఇప్పటికే జాతీ దర్యాప్తు సంస్థ ఇతడిపై 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు అయిన గోల్డీ బ్రార్ కెనడా నుంచి కార్యకలాపాలు నిర్వహించేవాడు. కానీ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యలో నిందితుడిగా తేలిన తర్వాత అమెరికాకు వెళ్లిపోయాడు.
దరమ్ జీత్ సింగ్.. పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతడి హత్య కోసం గ్యాంగ్‌స్టర్లకు ఆయుధాలు ఏర్పాటు చేశాడని.. ఉగ్రవాద సంస్థలతో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే 2023 ఆగస్టులో ఇతడు కూడా అమెరికాకు పారిపోయాడు.
![]() |
![]() |