ఏపీ సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తాజాగా ముస్లిం ఉద్యోగుల విషయంలో సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఆఫీసులు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు గంట ముందే కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకూ రంజాన్ మాసం మొత్తం అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ఉపాధ్యాయులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటుగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధులు నిర్వహిస్తున్న ముస్లిం ఉద్యోగులందరికీ వెసులుబాటు కల్పించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల నేపథ్యంలో ఈ వెసలుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ముస్లింలకు రంజాన్ తోఫా పథకం అమలు చేయాలని చంద్రబాబు మంగళవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా కింద నిత్యావసర వస్తువులు అందిస్తూ వచ్చారు. ఐదేళ్ల పాటు కొనసాగిన ఈ పథకాలను వైసీపీ హయాంలో నిలిపివేశారు.
అయితే టీడీపీ మరోసారి అధికారంలోకి రావటంతో రంజాన్ తోఫా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫాను అందించే ఏర్పాట్లు చేయాలని మంగళవారం ఆదేశించారు. అలాగే ఇమామ్, మౌజమ్ల వేతనాల విడుదలపైనా కీలక ఆదేశాలు జారీచేశారు. ఇమామ్, మౌజమ్ల వేతనాల విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలో హజ్‌హౌస్ నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు తీసుకున్న 24 గంటల్లోనే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులు త్వరగానే ఇళ్లకు వెళ్లే వెసలుబాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
![]() |
![]() |