విజయనగరం , బొబ్బిలి బజారులో ఈ నెల 1న రాత్రి జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 45 తులాల బంగారు ఆభరణాలను రకవరీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలను ఎస్పీ వకుల్‌జిందాల్ వెల్లడించారు.బొబ్బిలి పట్టణంలో జ్యూయలరీ షాపు యజమాని గ్రంధి రవికుమార్ ఇంట్లో ఈనెల 1న రాత్రి చోరీ జరిగిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని బంగారు వడ్డాణం, గాజులు, గొలుసులు, బ్రాస్‌లెట్లు, ఇతర బంగారు వస్తువులు (45 తులాల విలువ రూ.10. 50 లక్షలు) చోరీకి పాల్పడినట్లు ఈ నెల 2న బొబ్బిలి పోలీసులకు రవికుమార్ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ కె.సతీష్‌కుమార్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆధారాలను బట్టి నిందితుల కదలికలను పరిశీలిస్తూ వచ్చారు. కాగా నిందితులుగా ఉన్న బొబ్బిలి మండలం గున్నతోటవలసకు చెందిన పెంకి శ్రీనివాసరావు (ఎ-2), పాత బొబ్బిలికి చెందిన బత్తుల సర్వేశ్వరరావు (ఎ-3), ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన ముద్దాడ నరసింగరావు (ఎ-4)లు పేకాట, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో పాత నేరస్తుడు అయిన సీతానగరం మండలం జోగింపేట గ్రామానికి చెందిన పోలా భాస్కరరావు(ఎ-1)తో పరిచయం అయింది. దొంగతనాలు చేసేందుకు ఇల్లు చూపిస్తే చోరీ చేసిన సొత్తులో వాటా ఇచ్చేందుకు వీరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే ఈ నెల ఒకటిన రాత్రి గ్రంధి రవికుమార్ ఇంట్లో చోరీ చేశారు. దొంగిలించిన బంగారు వస్తువుల్లో కొన్నింటిని కరిగించేశారు. మిగతా వాటిని అమ్మేందుకు నిందితులు శ్రీనివాసరావు, బత్తుల సర్వేశ్వరరావు, ముద్దాడ నర్సింగరావులు రాయగడ వెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐ అక్కడకు వెళ్లి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడున్నారో తెలుసుకుని వెళ్లి పట్టుకున్నారు. పరారీలో ఉన్న (ఎ-1) పోలా భాస్కరరావు గురించి గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
![]() |
![]() |